టీచర్ పోస్టుల భర్తీకి కసరత్తు మొదలైంది. జిల్లా ఎంపిక కమిటీల (డీఎస్సీ) నేతృత్వంలో కొత్తగా టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్టు (టీఆర్‌టీ) నిర్వహణకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. జిల్లాలవారీగా ఖాళీల వివరాలను విద్యా శాఖ ఇప్పటికే సేకరించింది. మే 15తో టీచర్ల బదిలీల కౌన్సెలింగ్ ముగియగానే ఖాళీలపై మరింత స్పష్టత రావడంతో పాటు కొత్త డీఎస్సీ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. దాదాపు 23 వేలకు పైగా టీచర్ పోస్టులతో కొత్త డీఎస్సీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది. టీచర్ పోస్టుల భర్తీకి అనుసరించాల్సిన రాత పరీక్ష నిర్వహణ విధానంపై కసరత్తు కూడా తుది దశకు చేరుకుంది.
టెట్, డీఎస్సీలను ఇప్పట్లా వేర్వేరుగా నిర్వహించడమా, లేక రెండింటిని కలిపి ఒకే పరీక్ష పెట్టడమా అన్నదానిపై ఇప్పటికే కమిటీ వేయడం తెలిసిందే. ఒకవేళ కొత్త విధానం అమల్లోకి వస్తే టెట్ రద్దవుతుంది. అదే జరిగితే టెట్‌లో అర్హత సాధించిన 3.8 లక్షల మంది విషయంలో గందరగోళం నెలకొంటుంది. టెట్‌తో పాటే వారి స్కోరుకు ఇచ్చిన 20 శాతం వెయిటేజీ, స్కోరుకుండే ఏడేళ్ల వ్యాలిడిటీ కూడా రద్దవుతాయి. దీనిపై అభ్యర్థుల నుంచి న్యాయపరమైన చిక్కులు రావచ్చని అధికారుల్లో ఆందోళన నెలకొంది. కమిటీ సిఫార్సులను చూశాక ఈ అంశాలన్నింటినీ సమీక్షించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
జిల్లాలవారీగా సేకరించిన వివరాల ప్రకారమే
రాష్ట్రంలోని టీచర్ పోస్టు ఖాళీల వివరాలను పాఠశాల విద్యా శాఖకు డీఈఓలు అందజేశారు. 13 వేలకు పైగా ఖాళీలున్నట్టు తేల్చారు. వీటితో పాటు గత ఫిబ్రవరిలో ఆర్థిక శాఖ అనుమతిచ్చిన 10,121 రాజీవ్ విద్యా మిషన్ (ఆర్‌వీఎం) పోస్టులున్నాయి. వాటిలో 149 భాషా పండితులు, 200 స్కూల్ అసిస్టెంట్లు, మిగితావన్నీ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులని సమాచారం. వీటిని ఇటీవల స్కూళ్లలో సర్దుబాటు చేయడంతో ప్రస్తుతం ఆ మేరకు ఖాళీలు ఏర్పడనున్నాయి. ఇవిగాక రిటైర్మెంట్ ద్వారా, నెలా నెలా పదోన్నతుల ద్వారా ఏర్పడ్డ క్లియర్ వేకెన్సీలు 13 వేలకు పైగా ఉన్నట్టు అధికారులు లెక్కలేశారు.
వీటిలో ఆదిలాబాద్ లో 570, అనంతపూర్‌లో 500, చిత్తూరులో 487, తూర్పు గోదావరిలో 879, పశ్చిమ గోదావరిలో 604, గుంటూరులో 703, హైదరాబాద్‌లో 1,553, కడపలో 212, కరీంనగర్‌లో 855, ఖమ్మంలో 585, కృష్ణాలో 231, కర్నూలులో 431, మహబూబ్‌నగర్‌లో 737, మెదక్‌లో 720, నల్గొండలో 509, నెల్లూరులో 347, నిజామాబాద్‌లో 1,099, ప్రకాశంలో 303, రంగారెడ్డిలో 590, శ్రీకాకుళంలో 643, విజయనగరంలో 220, విశాఖపట్నంలో 443, వరంగల్‌లో 592 పోస్టులున్నట్టు సమాచారం.
పరీక్ష విధానంపై త్వరలో నివేదిక
టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీలు నిర్వహించే టీఆర్‌టీ రాత పరీక్ష కంటే ముందు అభ్యర్థులు టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. పైగా నియామకాల్లో టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. దాంతోపాటు ఆ స్కోరుకు ఏడేళ్ల వ్యాలిడిటీని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటిదాకా మూడుసార్లు టెట్ నిర్వహించగా 4 లక్షల మందికి పైగా అర్హత సాధించారు.
2012 డీఎస్సీలో ఎంపికైన 21 వేల మంది పోను మరో 3.8 లక్షల మంది కొత్త నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. వీరుగాక మరో లక్షన్నర మంది కూడా కొత్తగా డీఎస్సీ రాసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో టెట్, డీఎస్సీ వేర్వేరుగా కాకుండా రెండింటిని కలిపి టెస్టు (ఉపాధ్యాయ అర్హత, ఎంపిక పరీక్ష) పేరుతో ఒకే పరీక్షగా నిర్వహించాలని ప్రభుత్వం యోచించింది. ఇందుకోసం వేసిన కమిటీ తమిళనాడులో అధ్యయనం చేసింది. అనుసరించాల్సిన నిబంధనలపై సిఫార్సులతో త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
టెస్ట్ కాదు.. టెర్ట్!
ఉపాధ్యాయ అర్హత, ఎంపిక పరీక్ష (టెస్టు) కాకుండా రాత పరీక్షను ఉపాధ్యాయ అర్హత, నియామక పరీక్ష (టెర్ట్) పేరుతో నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేయనుంది. టెట్, డీఎస్సీ సిలబస్‌లను కలిపేసి ఎస్‌జీటీ, తత్సమాన పోస్టులకు ఒకే పేపరుగా (టెర్ట్ పేపరు-1గా) పరీక్ష నిర్వహించాలని భావిస్తోంది. అప్పుడు టెట్ మాదిరిగా 20 శాతం వెయిటేజీ వేరుగా ఉండకుండా ఈ పరీక్షకే 100 శాతం స్కోర్ ఇస్తారు. నియామకాలను కూడా మెరిట్ ఆధారంగానే చేపట్టాల్సి ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్, తత్సమాన పోస్టులకు టెర్ట్ పేపరు-2 ఉంటుంది. ఇందులో రెండు భాగాలుంటాయి. పార్ట్-1లో అర్హత పరీక్ష, పార్ట్-2లో నియామక పరీక్ష సిలబస్‌తో పేపర్లను రూపొంది స్తారు. రెండు పేపర్లకూ ఒకే రోజు పరీక్షలు నిర్వహిస్తారు. పార్ట్-1 పేపరును ముందుగా దిద్ది, అందులో కనీస అర్హత మార్కులు వచ్చిన వారివి మాత్రమే పార్ట్-2 పేపర్లు దిద్దుతారు. వాటి ఆధారంగా నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది.

on May 14, 2013
categories: | edit post

0 comments

widgets

Visit my New Site www.tgteacherinfo.com

Join with us

Teacher-Info Today

QUICK LINKS

Newsletter Subscription

Get teacher-info updates through E-mail. Enter your E-Mail address to receive updates and exclusives from teacher-info

Enter your email address: